కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 28 ; ఉద్యోగ ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ జన సమితి జిల్లా సమన్వయకర్త లావుడ్య ప్రేమకుమార్ అన్నారు. హైదరాబాద్ లో నేడు జరిగే తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభ గోడప్రతులను శనివారం రెబ్బెన మండల కేంద్రంలో విడుదల చేసారు. అనంతరం మాట్లాడుతూ హైదరాబాద్లో నిర్వహించే ఆవిర్భావ సభ కు జిల్లా నుండి ప్రజలు అత్యధికంగా తరలిరావాలని జిల్లా సమన్వయకర్త లావుడ్య ప్రేమకుమార్ కోరారు. ఉద్యోగాలు దొరకక నిరుద్యోగులు ఆవేదనకు గురి అవుతున్నారని వారన్నారు. ఉన్న ఖాళీలను ప్రకటించి క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేయాలని ఎంత మొత్తుకున్నా ప్రభుత్వం చెవిన పడడం లేదని అన్నారు. రెండు లక్షల పైన ఉన్న ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టడం లేదన్నారు. విద్యార్థులకు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ కి డబ్బులు ఇవ్వడం లేదన్నారు, రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు ఇవ్వక నెలలు తరబడి కాళ్ళు అరిగేలా తిప్పుకుంటున్నారన్నారు. అక్కరకు రాని ప్రాజెక్టులు పెట్టి పనికిమాలిన పైపులు వేసి కాంట్రాక్టర్లు జేబులు నింపుతున్నారని అన్నారు. అలాగే ప్రజల కొరకు పైసలు రావు కానీ కాంట్రాక్టర్ల కోసం అప్పులు చేయడానికి తెరాస ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకంలో కొమురంభీం జిల్లా ప్రజలకు పూర్తిగా అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రంలో రెండు పంటలకు డబ్బులు ఇస్తే మన దగ్గర నీటి వనరు లేక ఒక్క పంట కూడా సరిగ్గా పండటం లేదన్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం దేవేందర్, జి రాజేష్, డి మల్లయ్య, డి గణపతి, వెంకటేశ్, శంకర్, వినోద్, హరికృష్ణ, నూనయ్య, విట్టల్, దేవాజి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment