Monday, 3 August 2015

మరో దృశ్యకావ్యం [ సినిమా]

తాను ఏ తరహా కథాంశాన్ని ఎంచుకున్నా దానిని వైవిధ్యభరితంగా తెరకెక్కించగల దర్శకుడిగా గౌతమ్‌ వాసుదేవమీనన్‌కు పేరుంది. కెరీర్‌ తొలిదశలో నాగచైతన్య, సమంతలకు 'ఏ మాయె చేశావె' వంటి హిట్‌ చిత్రాన్ని అందించి పరిశ్రమలో వారి ఎదుగుదలకు ఎంతగానో దోహదం చేశారు. 'ఏ మాయె చేశావె' తర్వాత నాగచైతన్య పలు చిత్రాలు చేసి హీరోగా స్థిరపడ్డారు. మళ్లీ ఇంతకాలం తర్వాత నాగచైతన్య, గౌతమ్‌మీనన్‌ల కలయికలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. మరో సుందర దృశ్యకావ్యంగా ప్రచారం జరుగుతున్న ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవల చెన్నైలో ప్రారంభమైన నేపథ్యంలో నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగా నాగచైతన్యపై భారీ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ని గౌతమ్‌మీనన్‌ చిత్రీకరించారు. రెండురోజుల గ్యాప్‌ అనంతరం సోమవారం నుంచి నాగచైతన్య తిరిగి షూటింగ్‌లో పాల్గొంటున్నారు.
తొలి షెడ్యూల్లో 50 శాతం చిత్రీకరణను పూర్తిగావించాలని యూనిట్‌ నిర్ణయించుకుందట. ఇక తెలుగు, తమిళ భాషలలో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు వెర్షన్‌లో నాగచైతన్య సరసన మలయాళీ భామ మంజిమ మోహన్‌ నాయికగా నటిస్తోంది. తెలుగులో దీనిని కోన వెంకట్‌ నిర్మిస్తుండగా, ఈ చిత్రానికి ఇంకా టైటిల్‌ను ఖరారు చేయలేదు.
ఇదే చిత్రం తమిళ వెర్షన్‌లో శింబు హీరోగా నటిస్తుండగా, ఆ చిత్రానికి 'అచ్చం ఎన్బదు మదమైయద' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీనికి ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

No comments:

Post a Comment