కుమురమ్ భీమ్ ఆసిఫాబాద్ జిల్లా: 29: విద్యా రంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ అన్నారు. రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా శుక్రవారం రోజున కుమురమ్ భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పాలనాధికారి కార్యాలయం ముందు బైఠాయించి విద్యా రంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేస్తూ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలు నెలకొన్న ప్రభుత్వం, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తున్నారని ఆరోపించారు. పెండింగులో ఉన్న ఉపకారవేతనాలు, ఫీజు రేయింబర్స్మెంట్ లను వెంటనే విడుదల చేయాలని, పెరుగుతున్న ప్రైవేటు పాటశాలల దోపిడీని అరికట్టి కార్పొరేట్ విద్యా సంస్థలను రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు. అదే విధంగా జిల్లాలో అనేక విద్యా వనరులు కల్పించాల్సిన అవసరం ఉన్నప్పటికీ కల్పించడంలో పూర్తిగా జిల్లా యంత్రాంగం విఫలం చెందిదని ఆరోపించారు. అసిఫాబాద్ జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ప్రారంభించాలని, ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలను మంజూరు చెయ్యాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ డివిజన్ అధ్యక్షుడు బావునే వికాస్, కార్యదర్శి పూదరి సాయికిరణ్, డివిజన్ ఉపాధ్యక్షుడు పర్వతి సాయి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి చిరంజీవి, నాయకులు జాడి సాయి, మహేందర్, అరుణ్ సాయి, అనుదీప్, వంశీ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment