సామాజిక తెలంగాణ సమగ్రాభివృద్ధికై పోరుబాట ; సిపిఐ జిల్లా కార్యదర్శి బద్రి సత్యనారాయణ
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 13 : తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ, అనేక అలుపెరుగని ఉద్యమాలు, త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించి మూడున్నర సంవత్సరాలు కావస్తున్నా టి.ఆర్.ఎస్. ప్రభుత్వం ప్రజా ఆకాంక్షలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని సిపిఐ జిల్లా కార్యదర్శి బద్రి సత్యనారాయణ అన్నారు. సోమవారం రోజున రెబ్బెనలో సిపిఐ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న పోరుబాట పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ స్వరాష్ట్రాన్ని సాధించుకుంటే తమ కలలన్ని సాకారమయితాయని అన్ని వర్గాల ప్రజలు ఆశించారని , తెలంగాణ ఉద్యమం సందర్భంగా, ఎన్నికల ప్రణాళికలో, ఎన్నికల అనంతరం అధికారం చేపట్టిన కెసిఆర్ తొలి మంత్రివర్గ సమావేశంలో చేసిన బాసలు అడియాసలయ్యాయని , ప్రజలు ఆశించిన సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి ఆచరణకు నోచుకోలేదని అన్నారు. నీళ్ళు, నిధులు, నియామకాలు, ప్రజాస్వామ్య పరిరక్షణ, అందరికీ విద్య,వైద్యం,తదితర ఆకాంక్షలతో తెలంగాణ ఉద్యమం కోనసాగిందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను తెలుసుకోవాడానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వేంకట్ రెడ్డి గారి ఆద్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరుబాట నిర్వహిస్తున్నామని , ఈ నెల 15వ తేదీన రెబ్బెన మండల కేంద్రానికి పోరుబాట బృందం రానుందని కావున ఈ కార్యక్రమానికి ప్రజలు, యువకులు, విద్యార్థులు, మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తిరుపతి, జగ్గయ్య,పొన్న శంకర్, రామడుగుల శంకర్, మండల కార్యదర్శి తిరుపతి,ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment