కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన అక్టోబర్ 12; రెబ్బెన మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం పట్టాదారు పాస్ పుస్తకాల కోసం మండలంలోని పలు గ్రామాల రైతుల ధర్నానిర్వహించారు. రైతులకు కొత్త పాసుబుక్కులు, ఆన్లైన్ లో పహాణీలు సకాలంలో అందేటట్లు చూడాలని, కార్యాలయంలో ఆపరేటర్ లు , వి ఆర్ ఓ లు ప్రతి పనికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని రాష్ట్ర మానవ హక్కుల ప్రెసిడెంట్ డాక్టర్ సహేరా భాను అన్నారు. మండలంలోని రైతుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ రెవిన్యూ ఇన్సపెక్టర్ ఊర్మిళ కు వినతి పత్రం అందచేశారు. అనంతరం మాట్లాడుతూ మండలంలోని గ్రామాల రైతులు తమ తమ పొలం పనులను వదలి పాస్ పుస్తకాలకు, పహాణీల కోసం కార్యాలయం చుట్టూ రోజులతరబడి పడిగాపులు కాస్తున్నారని, సిబ్బంది అందుబాటులో ఉండకపోవడంతో వారి సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ లు , వి ఆర్ ఓ లు ప్రతి పనికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారన్నారు. కావున వారి సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం రైతు సమస్యల పరిష్కార సమావేశాలు ఏర్పాటు చేసి పరిష్కరించాలని కోరారు.ధర్నా స్థలానికి రెబ్బెన ఎస్సై దీకొండ రమేష్ వచ్చి సంబంధిత ఎం ఆర్ ఓ, ఆర్ డి ఓ లతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని సర్ది చెప్పి ధర్నా విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో మండల మానవ హక్కుల వర్కింగ్ ప్రెసిడెంట్ రంగు మహేష్,మండలంలోని వివిధ గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
No comments:
Post a Comment