Saturday, 26 January 2019

పురుగుల మందు తాగి విద్యార్థిని ఆత్మహత్య

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  26 ; రెబ్బెన మండలంలోని కొమురవెల్లి గ్రామానికి చెందిన పోతురాజుల నాగ స్పందన (17) ఇంటర్ విద్యార్థిని శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై దీకొండ రమేశ్ తెలిపారు.  ఆయన తెలిపిన వివరాల ప్రకారం కొమురవెల్లి గ్రామానికి  చెందిన పోతురాజుల శ్రీనివాస్ సంతోషికుమారిలకు కూతుళ్లు నాగ స్పందన, సాత్విక  ఉన్నారు.  శ్రీనివాస్ గత కొంతకాలంగా మద్యానికి  బానిసై  తాగిన మైకంలో ఇంటికి వచ్చి భార్య సంతోషి కుమారితో పాటు పిల్లలతో తరచూ గొడవలకు దిగుతుండడంతో   మద్యం సేవించటం మానుకుని గొడవలు చేయకుండా ఉండాలని బంధువులతో పాటు కూతుళ్లు సైతం శ్రీనివాస్ కు  ఎన్నోసార్లు నచ్చచెప్పినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు.  ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి సైతం మద్యం సేవించి ఇంటికి వచ్చిన అతను భార్యా పిల్లలతో గొడవకు దిగడంతో  తరచుగా తాగిన మైకంలో తండ్రి చేసే గొడవలకు తీవ్ర మనస్తాపానికి గురైన నాగస్పందన  జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉన్న పురుగుల మందు సేవించింది.  గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన మంచిర్యాలలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు తెలిపారు.  మృతురాలి మేనమామ పెద్దింటి మధుకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

No comments:

Post a Comment