కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 09 : ప్రపంచ విప్లవ కెరటం చేగువేరా అని, ఆయన అశయాలను యువకులు విద్యార్థులు కొనసాగించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ అన్నారు. సోమవారం చేగువేరా 50వ వర్ధంతి సందర్భంగా రెబ్బెనలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో చేగువేరా చిత్ర పటానికి ఏఐఎస్ఎఫ్ నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ క్యూబా సోషలిస్టు విప్లవంలో తరతరాలుగా చెరిగిపోని ముద్ర వేసుకున్నాడు చే గువేరా అని, సామ్రాజ్య వాదానికి సింహస్వప్నంగా నిలిచాడు. అందుకే గొప్ప విప్లవకారుడయ్యాడు అని అన్నారు. 1928లో అర్జెంటీనాలో ని రోసిరోలో జన్మించాడు. ఇంజనీరింగ్ విద్య చదువుతున్నప్పుడు వ్యాధిగ్రస్తుల బాధలను చూసి చలించిపోయిన చే గువేరా ఇంజనీరింగ్ విద్యని మధ్యలో నిలిపివేసి బ్యూనస్ ఎయిర్స్‌లో వైద్యవిద్య అభ్యసించాడని, చదువు పూర్తయ్యాక లాటిన్ అమెరికా అంతటా పర్యటించాడని, ఉత్తర అమెరికాలో రైతులు, బొగ్గుగని కార్మికులు పీడిత తాడిత ప్రజల దుర్భరమైన జీవితాలను, నరకయాతన చూసి చలించిపోయాడని, అమెరికా సిఐఎ ప్రోద్బలంతో జాకబ్ అర్బంజ్ ప్రభుత్వాన్ని కూల దోసిన తీరు చేగువేరా ప్రత్యక్షంగా కళ్ళారా చూసాడని, మెక్సికో వెళ్లి నియంత బాటిస్టాను కూలదోసేందుకై పోరాడుతున్న క్యూబా విప్లవకారులతో అక్కడే పరిచయాలు పెంచుకున్నాడని, చేగువేరా క్యూబా విప్లవకారులతో కలిసి విప్లవోద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడని, చేగువేరా క్రమశిక్షణ, ఏకాగ్రత, పట్టుదల గల గొప్ప సిద్ధాంతకర్త అని, క్యూబా విప్లవ అనంతరం చేగువేరా క్యూబా ప్రభుత్వంలో అనేకమైన కీలక పదవులు సమర్ధవంతంగా నిర్వహించాడని అన్నారు. పేద,బడుగు,బలహీన వర్గాల ప్రజలకు విద్య,వైద్యం,ఉపాధి హక్కులు కల్పించాలని పోరాటం చేశారని గుర్తు చేశారు. నేటి యువత చెడు వ్యసానాలకు దూరంగా ఉండి విద్య,వైద్యం,ఉపాధి హక్కుల కొరకు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి పర్వతి సాయి, నాయకులు లక్ష్మణ్,నవీన్,మహేష్,శ్రీకాంత్,తిరుపతి,రవీందర్,నితిన్,మౌనిక,జ్యోతి,దివ్య తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment