Sunday, 1 November 2026

ప్రజాస్వామ్య పరిరక్షణ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు

 డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ

ఆసిఫాబాద్‌,   నవంబర్‌ 2:

ఇండియా కూటమి ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణ లక్ష్యంగా నిర్వహించిన భారీ బహిరంగ సభ, మెగా ర్యాలీని విజయవంతం చేసిన అఖిలపక్ష నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు, ప్రజా సంఘాల ప్రతినిధులు, ప్రజలకు కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా భావించి మహాసభకు తరలివచ్చిన ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. ఓటు హక్కును కాపాడుకోవడం, రాజ్యాంగ విలువలను పరిరక్షించడం, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. ప్రజల హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం కోసం అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సభ విజయవంతానికి కృషి చేసిన ఇండియా కూటమి నాయకులు, అఖిలపక్ష నేతలు, కార్యకర్తలు, స్వచ్ఛందంగా పాల్గొన్న ప్రజలు, తెరవెనుక సహకరించిన ప్రతి ఒక్కరికీ మరోసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రదర్శించిన ఐక్యత, నిబద్ధత భవిష్యత్తులోనూ కొనసాగాలని ఆకాంక్షించారు.


మున్నూరు కాపు పటేల్స్‌ రాష్ట్ర కమిటీ ఎన్నికలకు సన్నాహక సమావేశం

డిసెంబర్‌ 6న బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు

తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్స్‌ రాష్ట్ర కమిటీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆదివారం వేములవాడలోని మున్నూరు కాపు సత్ర భవనంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిసెంబర్‌ 6న ఎన్నికల కమిటీ ఆధ్వర్యంలో బ్యాలెట్‌ పద్ధతిలో రాష్ట్ర కమిటీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్‌, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బోరిగం రాజారాం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమశేఖర్‌, ఆసిఫాబాద్‌ జిల్లా అధ్యక్షుడు గజ్జల లక్ష్మణ్‌, కాగజ్‌నగర్‌ కౌన్సిలర్‌ గజ్జల లావణ్య, జిల్లా కోశాధికారి దేవేందర్‌, జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఇందూరు తిరుపతి, జిల్లా యువజన అధ్యక్షుడు గాజుల ప్రసాద్‌, జిల్లా ఉపాధ్యక్షుడు రవీందర్‌, జిల్లా కార్యవర్గ సభ్యుడు అడ్వల పెంటన్న తదితరులు పాల్గొన్నారు.

గుండి గ్రామంలో తాత్కాలిక వంతెన పనులు ప్రారంభం

ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా సర్పంచ్‌ చర్యలు

ఆసిఫాబాద్‌, నవంబర్‌ 1:                                                                                                                                                                               గ్రామ ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా గుండి గ్రామ సర్పంచ్‌ జాబరి రవీందర్‌ ఆధ్వర్యంలో ఆదివారం తాత్కాలిక వంతెన నిర్మాణ పనులు చేపట్టారు. గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రవాణా సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా పనులు కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ చందన కడ సంతోష్‌, వార్డు సభ్యులు జాబోరే రాజు, రాస్పల్లి మోహన్‌, దోకె మరోతి, శ్రీకాంత్‌, రమేష్‌, కళ్యాణ్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

‘ఓట్‌ బచావో–దేశ్‌ బచావో’ సభలో రెబ్బెన కాంగ్రెస్‌ నాయకులు


రెబ్బెన: కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ ఇచ్చిన ‘ఓట్‌ బచావో–దేశ్‌ బచావో’ పిలుపు మేరకు ఆదివారం న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్కతో కలిసి రెబ్బెన మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు కేసరి కిషన్‌ గౌడ్‌ పాల్గొన్నారు. యువజన కాంగ్రెస్‌ నాయకుడు ఎర్రం తిరుపతితో పాటు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు సభకు హాజరయ్యారు.

ఆదిలాబాద్‌లో కేటీఆర్‌కు కోనేరు కోనప్ప ఘన స్వాగతం

 

ఆసిఫాబాద్‌  : ఆదిలాబాద్‌లోని డైట్‌ కళాశాల మైదానంలో నిర్వహించనున్న రైతు గర్జన సభకు హాజరయ్యేందుకు వచ్చిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు సిర్పూర్‌ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోనప్పతో పాటు బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేటీఆర్‌కు ఆత్మీయ స్వాగతం పలికారు.

15 మంది అంత్యక్రియలకు ఉచితంగా కట్టెలు అందించిన కోనేరు కోనప్ప


కాగజ్‌నగర్‌: పేద కుటుంబాలకు అంత్యక్రియల ఖర్చుల భారం తగ్గించాలనే ఉద్దేశంతో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చేపట్టిన ఉచిత కట్టెల పంపిణీ సేవ కొనసాగుతోంది. కాగజ్‌నగర్‌ మండలం జీడిచెను గ్రామానికి చెందిన జెల్లా నాగమల్లు మృతి చెందడంతో, ఆయన అంత్యక్రియల కోసం కోనప్ప ఉచితంగా కట్టెలు అందజేశారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సేవా కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు కాగజ్‌నగర్‌ పరిసర ప్రాంతాల్లో 15 మంది అంత్యక్రియలకు ఉచితంగా కట్టెలు అందించినట్లు తెలిపారు. ఈ సహాయానికి బాధిత కుటుంబాలు కోనప్పకు కృతజ్ఞతలు తెలియజేశాయి.

కేటీఆర్‌ రైతు గర్జన సభకు తరలివెళ్లిన బీఆర్‌ఎస్‌ నాయకులు

 బాల్క సుమన్‌ ఆదేశాలతో కలగూర రాజకుమార్‌ ఆధ్వర్యంలో హాజరు

మంచిర్యాల, నవంబర్‌ 1: ఆదిలాబాద్‌లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నిర్వహించిన రైతు గర్జన సభకు భీమారం మండలానికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. చెన్నూర్‌ మాజీ ఎమ్మెల్యే, మంచిర్యాల జిల్లా బీఆర్‌ఎస్‌ మాజీ అధ్యక్షుడు బాల్క సుమన్‌ ఆదేశాల మేరకు భీమారం మాజీ మండల అధ్యక్షుడు కలగూర రాజకుమార్‌ ఆధ్వర్యంలో నాయకులు సభకు తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో ధర్మారం సర్పంచ్‌ దాసరి మణిదీపక్‌, టీఆర్‌ఎస్‌వీ మండల అధ్యక్షుడు రాజేష్‌ నాయక్‌, యువజన నాయకులు చింతం తిరుపతి, రాజు నాయక్‌, దాంపూర్‌ మాజీ ఉపసర్పంచ్‌ సంతోష్‌, నవీన్‌ నాయక్‌, వెంకట్‌ మేస్త్రి, పానుగంటి లచ్చన్న, మేకల రాజబాబు, కిరణ్‌ నాయక్‌, చకినారపు రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

రైతు గర్జనకు బెల్లంపల్లి బీఆర్‌ఎస్‌ శ్రేణుల తరలింపు

మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌కు పయనం


బెల్లంపల్లి,  నవంబర్‌ 1:  ఆదిలాబాద్‌లో రైతులకు మద్దతుగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘రైతు గర్జన’ కార్యక్రమానికి బెల్లంపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నాయకత్వంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బత్తుల సుదర్శన్‌, సుందర్‌రావు, దాసరి శ్రీనివాస్‌, 13వ వార్డు బీఆర్‌ఎస్‌ నాయకులు, ఆసం అఖిల్‌, ఎం.డి. హనీఫ్‌ పాషా, గజేందర్‌, దుండ్ర రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఓటు హక్కు పరిరక్షణ ఉద్యమానికి జిల్లా కాంగ్రెస్‌ మద్దతు

 ఢిల్లీలో ‘ఓట్‌ బచావో–దేశ్‌ బచావో’ సభకు భారీగా తరలిన నాయకులు, కార్యకర్తలు


ఆసిఫాబాద్‌,  నవంబర్‌ 1: 

కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ ఇచ్చిన ‘ఓట్‌ బచావో–దేశ్‌ బచావో’ పిలుపు మేరకు ఆదివారం రామ్‌లీలా మైదానంలో నిర్వహించిన బహిరంగ సభకు కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క నాయకత్వంలో తెలంగాణ భవన్‌ నుంచి రామ్‌లీలా మైదానం వరకు కాంగ్రెస్‌ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్రం సుగుణక్క మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరిరక్షణతో పాటు ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడటమే ఈ ఉద్యమ లక్ష్యమని పేర్కొన్నారు. ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేస్తూ ఓట్ల చోరీకి బీజేపీ ప్రభుత్వం పాల్పడుతోందని ఆరోపించారు. ఈ పోరాటం కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమే పరిమితం కాదని, దేశంలోని ప్రతి ఓటరు హక్కులను కాపాడే ఉద్యమమని అన్నారు. రాహుల్‌ గాంధీ నాయకత్వంలో చేపడుతున్న ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటానికి జిల్లా కాంగ్రెస్‌ శ్రేణులు సంపూర్ణ మద్దతు ఇస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ఆసిఫాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్‌, మండల అధ్యక్షులు రాపర్తి మురళి, ఇమ్రాన్‌, సుజాహిద్‌ ఖాన్‌, రమేష్‌ జాదవ్‌, కిషన్‌ గౌడ్‌, చునర్కర్‌ మహేష్‌, డీసీసీ కార్యవర్గ సభ్యులు, యువజన కాంగ్రెస్‌, మహిళా కాంగ్రెస్‌ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

మటన్‌ షాపులపై పంచాయతీ తనిఖీలు

 

లైసెన్సులు, మేకల ఆరోగ్య ధ్రువీకరణ పత్రాల పరిశీలన

 ఆసిఫాబాద్‌,  నవంబర్‌ 1: 

 గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణ, పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా రాజంపేట ఆదివారం గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో మటన్‌ షాపులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి జె. సాయికృష్ణ, బిల్‌ కలెక్టర్‌ నాగేందర్‌, సిబ్బంది దుకాణాలను సందర్శించి లైసెన్సులు, మేకల ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. మాంసం విక్రయాలకు అవసరమైన అనుమతులు, ధ్రువీకరణ పత్రాలు సక్రమంగా ఉండాలని, దుకాణాల్లో పరిశుభ్రత పాటించాలని వ్యాపారులకు సూచించారు. ప్రజారోగ్యానికి ఇబ్బందులు కలగకుండా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులతో కూడిన పాలకవర్గం గ్రామాభివృద్ధితో పాటు ప్రజారోగ్యం, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యతనిస్తూ చర్యలు చేపడుతోంది.

బీసీ కాలమ్‌ చేర్చాలి.. మూడు డిక్లరేషన్లు అమలు చేయాలి

 

బీఎల్‌ఎఫ్‌, ప్రజా సంఘాల నాయకుల డిమాండ్‌

మంచిర్యాల, నవంబర్‌ 1: 

 జనగణనలో బీసీలకు ప్రత్యేక కాలమ్‌ చేర్చి సమగ్ర వివరాలు సేకరించాలని, తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన మూడు డిక్లరేషన్లను అమలు చేయాలని బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌), ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం దశలవారీగా ఆందోళనలు, పోరాటాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పూలే భవన్‌లో బీఎల్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో పసులేటి వెంకటేష్‌ అధ్యక్షతన రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ సంకె రవి, పసులేటి వెంకటేష్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జనగణనలో బీసీలకు ప్రత్యేక కాలమ్‌ లేకపోవడం వల్ల వారి జనాభా, ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులపై సమగ్ర సమాచారం సేకరించలేని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. బీసీలకు ప్రత్యేక కాలమ్‌ ఏర్పాటు చేసి పూర్తి వివరాలు సేకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన రైతు, బీసీ, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లలో మూడు డిక్లరేషన్లను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజలను చైతన్యపరిచి దశలవారీగా ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో బీఎల్‌ఎఫ్‌ నాయకులు కన్నూరి సమ్మయ్య, దూలం శ్రీనివాస్‌, ప్రజా ప్రంట్‌ నాయకుడు జైపాల్‌ సింగ్‌, ఐఆర్‌సీపీ నాయకుడు కె. జయరావు, ఎంఆర్‌పీఎస్‌ నాయకుడు సుందిళ్ల మల్లేష్‌, సామాజిక సంఘాల నాయకులు సరిత రమాదేవి, మహేందర్‌, తాడూరి పోచన్న, ధర్మన్న, శ్రీనివాస్‌, స్వామి తదితరులు పాల్గొన్నారు.

పీటీ స్వామి సేవలు చిరస్మరణీయం

కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తాం: మాజీ మంత్రి హరీశ్‌రావు

గోదావరిఖని,  నవంబర్‌ 1: 

తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు కీర్తిశేషులు పీటీ స్వామి సంతాప సభకు ఆదివారం మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు హాజరయ్యారు. గోదావరిఖనిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్వామి చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ పీటీ స్వామి కుటుంబానికి బీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆయన సేవలకు గుర్తుగా కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు రేణికుంట్ల ప్రవీణ్‌, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, కోరుకంటి చందర్‌, పుట్ట మధు, దాసరి మనోహర్‌రెడ్డి, కొల్లేటి దామోదర్‌, మిర్యాల రాజిరెడ్డి, హరీశ్‌రెడ్డి, కౌశిక్‌ హరి, కొంకటి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.


యువతకు హామీలు కాదు.. ఉద్యోగాలు కావాలి

బీజేవైఎం జిల్లా కార్యవర్గ సమావేశంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై నాయకుల విమర్శలు


ఆసిఫాబాద్‌, నవంబర్‌ 1: 

నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరెడ్ల ప్రవీణ్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం విమర్శించారు. ఆదివారం ఆసిఫాబాద్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఎలాగతి సుచిత్‌ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా ఇన్‌చార్జి మదిన సురేందర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను వేగవంతం చేయాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలను విడుదల చేయడంతో పాటు విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని కోరారు. మారుమూల ప్రాంతాల యువతకు పోటీ పరీక్షల శిక్షణ, ఉద్యోగ మార్గదర్శకత్వం అందించాలని సూచించారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఎలాగతి సుచిత్‌ మాట్లాడుతూ యువత, విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తమ సంఘం నిరంతరం పోరాడుతుందని తెలిపారు. జిల్లాలో గ్రామస్థాయి నుంచి యువమోర్చాను బలోపేతం చేయాలని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు. సమావేశంలో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, మండల అధ్యక్షులు, ఇతర యువమోర్చా నాయకులు పాల్గొన్నారు.