Sunday, 1 November 2026

యువతకు హామీలు కాదు.. ఉద్యోగాలు కావాలి

బీజేవైఎం జిల్లా కార్యవర్గ సమావేశంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై నాయకుల విమర్శలు


ఆసిఫాబాద్‌, నవంబర్‌ 1: 

నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరెడ్ల ప్రవీణ్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం విమర్శించారు. ఆదివారం ఆసిఫాబాద్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఎలాగతి సుచిత్‌ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా ఇన్‌చార్జి మదిన సురేందర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను వేగవంతం చేయాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలను విడుదల చేయడంతో పాటు విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని కోరారు. మారుమూల ప్రాంతాల యువతకు పోటీ పరీక్షల శిక్షణ, ఉద్యోగ మార్గదర్శకత్వం అందించాలని సూచించారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఎలాగతి సుచిత్‌ మాట్లాడుతూ యువత, విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తమ సంఘం నిరంతరం పోరాడుతుందని తెలిపారు. జిల్లాలో గ్రామస్థాయి నుంచి యువమోర్చాను బలోపేతం చేయాలని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు. సమావేశంలో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, మండల అధ్యక్షులు, ఇతర యువమోర్చా నాయకులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment