నవంబర్ 5 నుంచి 11 వరకు వర్ధంతి సభలు నిర్వహించాలి: పీడీఎస్‌యూ నాయకులు
ఆసిఫాబాద్ : నవంబర్ 4, విప్లవ విద్యార్థి ఉద్యమ వారసత్వాన్ని కొనసాగిస్తూ విద్యార్థి అమరవీరుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పీడీఎస్‌యూ ఆసిఫాబాద్ మండల ప్రధాన కార్యదర్శి జగజంపుల తరుణ్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని జనకాపూర్‌లో బుధవారం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) ఆధ్వర్యంలో మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు షేక్ సమీర్, ప్రధాన కార్యదర్శి జగజంపుల తరుణ్ మాట్లాడుతూ.. శాస్త్రీయ విద్య, సమసమాజ స్థాపన లక్ష్యంగా నక్సల్బరీ, శ్రీకాకుళం, గోదావరి లోయ రైతాంగ పోరాటాల స్ఫూర్తితో తెలుగు నేలపై విద్యార్థి ఉద్యమాలు నిర్మితమయ్యాయని తెలిపారు. విద్యారంగంలో సమూల మార్పులు, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉపాధి అవకాశాలు, సమాజంలోని వివక్ష నిర్మూలన కోసం పోరాడుతూ పలువురు విద్యార్థి నాయకులు అమరులయ్యారని పేర్కొన్నారు. పీడీఎస్ స్థాపకుడు జార్జిరెడ్డి, పీడీఎస్‌యూ నిర్మాత జంపాల చంద్రశేఖర ప్రసాద్, శ్రీపాద శ్రీహరి, కోలా శంకర్, స్నేహలత, రంగవల్లి తదితర అమరవీరులను స్మరిస్తూ నవంబర్ 5 నుంచి 11వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలు, వసతి గృహాల్లో వర్ధంతి సభలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అమరవీరుల స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద చర్యలు, విద్యార్థి వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని అన్నారు. సమావేశంలో పీడీఎస్‌యూ మండల నాయకులు వి. మహేందర్, శివశంకర్, కార్తీక్, అరవింద్, సాయి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి