4, నవంబర్ 2026, బుధవారం

ఘనంగా డీవైఎఫ్‌ఐ 47వ ఆవిర్భావ దినోత్సవం

 

రెబ్బెన : నవంబర్ 4,  రెబ్బెన మండలంలోని రాంపూర్‌ గ్రామంలో డీవైఎఫ్‌ఐ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు డోంగ్రే గజానంద్‌ సంఘం జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా సహాయ కార్యదర్శి చాపిడి పురుషోత్తం మాట్లాడుతూ.. దేశ సమైక్యత, లౌకికత్వం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం డీవైఎఫ్‌ఐ నిరంతరం పోరాడుతోందని తెలిపారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, మత సామరస్యం, సామాజిక న్యాయం, సమానత్వం కోసం యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగం, పేదరికం, ధరల పెరుగుదలతో పాటు విద్యా, వైద్య రంగాల్లోని సమస్యలు యువతను వేధిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, ప్రైవేటు రంగంలో ఉద్యోగ భద్రత కల్పించాలని, నైపుణ్య శిక్షణ అందించాలని డిమాండ్‌ చేశారు. నాణ్యమైన ఉచిత విద్యతో పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉపకార వేతనాలను సకాలంలో విడుదల చేయాలని కోరారు. భగత్‌సింగ్‌, చేగువేరా ఆశయాలతో యువతలో శాస్త్రీయ దృక్పథం, సామాజిక బాధ్యత పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. నిరుద్యోగం, విద్యా సమస్యలు, సామాజిక అసమానతలు, మాదకద్రవ్యాల వ్యసనం, మహిళలపై హింసకు వ్యతిరేకంగా రానున్న రోజుల్లో ఉద్యమాలు చేపడతామని ప్రకటించారు. జిల్లాలోని యువత పెద్ద సంఖ్యలో సంఘంలో చేరాలని పిలుపునిచ్చారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి